Tuesday, July 7, 2015

త్రిమూర్తులు కొలువైన క్షేత్రం...త్రయంబకేశ్వరం-మహారాష్ట్ర







  • త్రిమూర్తులు కొలువైన క్షేత్రం...త్రయంబకేశ్వరం-మహారాష్ట్ర 


    'పాపవిముక్తికోసం గౌతముడు స్నానమాచరించిన ప్రవిత్రస్థలమది. జ్యోతిర్లింగరూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రమది. అన్నింటినీ మించి ప్రాచీనకాలం నుంచీ కుంభమేళాకు వేదికగా నిలుస్తోన్న ఆ త్రిసంధ్యాక్షేత్రానికి ఉన్న మరోపేరే త్రయంబకం' అంటూ ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన పెన్మెత్స శ్రీదేవి.

వృత్తిరీత్యా మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలోని సిన్నార్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా నాసిక్‌ దగ్గర్లోని త్రయంబకేశ్వరుణ్ణి దర్శించుకోవాలని మా బృందం అంతా కార్లలో బయలుదేరాం. ఈ మందిరం నాసిక్‌కు 28 కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్‌ పట్టణంలో ఉంది. దేవాదిదేవుడయిన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇదీ ఒకటి. వేదకాలంనాటి గురుకుల పాఠశాలలూ, అష్టాంగమార్గాన్ని అనుసరించే ఆశ్రమాలూ అక్కడ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీ.శ.1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్‌ పేష్వా నిర్మించాడట. చూడ్డానికి ఇదో నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో రాతిగోడలు ఉన్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరో ఆకర్షణ.

నాసిక్‌ మణి ఎక్కడ?
గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరోలోకాన్ని తలపించింది. శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని, చిరుదీపకాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నాం. లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు ఉన్నాయి. ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ చేసే అభిషేకాలవల్ల ఆ రూపాల్లో స్పష్టత లోపించింది. లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారుతొడుగుని తొడుగుతారు. దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచీ ఈ త్రయంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడుగా అలంకరిస్తున్నారట. ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్రవైఢూర్యాలతోనూ విలువైన రాళ్లతో సుందరంగా ఉంది. ఈ కిరీటం పాండవుల కాలంనాటిదని అంటారు. దీన్ని ప్రతీ సోమవారం, కార్తీకపౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కుశావర్త తీర్థస్థలానికి తీసుకువెళతారు. తరవాత వూరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్‌ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదట. మరాఠాలు- ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్‌కు చేరి ఆపై అనేక చేతులు మారింది.
కుశావర్త తీర్థంలో మునకలేశాం
జ్యోతిర్లింగ దర్శనానంతరం- ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఐదు నిమిషాల్లో కుశావర్త తీర్థానికి చేరుకున్నాం. దీన్ని వోల్‌వోకర్‌ శ్రీరావ్‌జీ సాహెబ్‌ పాఠ్‌నేకర్‌ క్రీ.శ. 1690-91లో నిర్మించాడట. ఈ కుశావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచీ సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులని అనుమతిస్తారట. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులూ శైవులూ మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్‌కుండ్‌లో సాన్నమాచరిస్తే, శైవ సాధువులు కుశావర్త్‌లో పుణ్యస్నానం చేస్తారట. గోదావరీ నది కుశావర్త్‌ నుంచి రామ్‌కుండ్‌లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ రెండు ప్రదేశాలూ కూడా పవిత్రమైనవే. అయితే భక్తులు సైతం కుశావర్త్‌లో స్నానమాచరించేందుకే మక్కువ చూపుతారు. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడంవల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్త్‌లో స్నానమాచరించడంవల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణేతిహాసం. అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరవు ఏర్పడటంతో తన ఆశ్రమం చుట్టూ ఉన్న కొద్దిస్థలంలోనే ధాన్యం పండించి, రుషులకు భోజనం పెట్టేవాడట గౌతమమహర్షి. ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే, దాన్ని తోలేందుకు ఓ దర్భను విసిరాడట. సూదిమొన గుచ్చుకుని అది ప్రాణం విడిచిందట. గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు, దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి, బ్రహ్మగిరిమీద తపస్సు చేయగా, శివుడు గంగను విడిచాడట. శివుణ్ణి వీడటం ఇష్టంలేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరిమీద ఉన్న గంగాద్వార్‌, త్రయంబక, వరాహ, రామలక్ష్మణ, గంగాసాగర... ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతున్నదట. దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటూ వెళ్లకుండా చేసి స్నానం చేశాడట గౌతముడు. అదే కుశావర్తంగా వాడుకలోకి వచ్చింది. మేం కూడా ఈ కుశావర్తంలోనే స్నానాలు చేశాం.

శివస్వరూపం... బ్రహ్మగిరి
పుణ్యస్నానం తరవాత బ్రహ్మగిరికి బయలుదేరాం. ఇది సముద్రమట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉంది. అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా 1800 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెబుతారు. త్రయంబకేశ్వర్‌ నుంచి బ్రహ్మగిరికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్ల సహాయంతో జీపులో బయలుదేరాం. దాదాపుగా అరగంటసేపు ప్రయాణించాక బ్రహ్మగిరి పర్వతం మధ్యకి చేరుకున్నాం. అక్కడ నుంచి కాలినడకన ఎక్కి గంగాద్వార్‌కి చేరుకున్నాం. గౌతముడు తపస్సు చేయగా ఎట్టకేలకు ప్రత్యక్షమైన గంగ ఉదుంబర(అత్తి)వృక్షంలో ప్రత్యక్షమై, తరవాత బ్రహ్మగిరి మధ్య నుంచి ఉద్భవించిందట. అదే గంగాద్వార్‌. గంగాదేవి మొదట కనిపించి అంతర్థానమైన చోట గంగామాత ఆలయం ఉంది. దీనిముందు గోముఖారపు రాతి కింద నుంచి గంగ ఉద్భవిస్తుంటుంది. ఆ పవిత్ర గంగాజలాల్ని చల్లుకుని పునీతులమయ్యాం. ఇక్కడ మాఘమాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఉత్సవం చేస్తారట. ఇక్కడి పంచతీర్థాల్లో గంగాద్వార్‌ ఒకటి. గౌతమ, అహల్యాసంగమ, బిల్వ, ఇంద్ర అనే మరో నాలుగు తీర్థాలూ త్రయంబకేశ్వరంలో ఉన్నాయి. గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన 108 శివలింగాలు ఈ గంగాద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి. 1907-1918 మధ్యలో కరంసీ హంస్‌రాజ్‌ అనే భక్తుడు ఈ మెట్లు నిర్మించి, గంగాద్వార్‌ వరకూ సౌకర్యవంతమైన యాత్రామార్గాన్ని ఏర్పరిచాడు.

ఆ ఆదిశంకరుడు లోకకల్యాణం నిమిత్తం తన జటాజూటం నుంచి గంగను ఇక్కడే విడిచాడనడానికి గుర్తుగా ఈ కొండమీద శివుడి మోకాళ్లూ మోచేతుల గుర్తులు కనిపిస్తాయి. అక్కడ ఓ శివాలయం కూడా ఉంది. అందులో స్వామిని దర్శించుకున్నాం.

ఈ బ్రహ్మగిరిమీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వైపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటివైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.
గోరఖ్‌నాథుడి గుహ
సిద్ధ పురుషుడైన గోరఖ్‌నాథుని గుహ కూడా ఈ పర్వతం పైనే ఉంది. ఇవన్నీ చూశాక అక్కడ నుంచి మేం పార్వతీదేవి మందిరానికి వెళ్లాం. కాలాసురుడు అనే రాక్షసుడు గంగాద్వారం దగ్గర ప్రవహించే గంగను చూసి తన పుక్కిట బంధించే ప్రయత్నం చేశాడట. అప్పుడు గౌతమ మహర్షి ఆదిశక్తి అయిన పార్వతీమాతను ప్రార్థించగా అమ్మవారు ఆ రాక్షసుణ్ణి వధించిందట. అయితే ప్రాణాలు విడుస్తూ శివభక్తుడయిన ఆ రాక్షసుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ఉచ్ఛరించడంతో ప్రసన్నురాలైన దేవి, అతని కోరిక మేరకు 'కోలాంబిక' అనే పేరుతో ఆ పర్వతంమీద స్థిరపడిందట. మేం అక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకుని రాబోతున్న కుంభమేళా గురించి అక్కడ పూజారిగారు ఎన్నో విషయాలు చెప్పారు.

కుంభమేళా
సత్యయుగంలో దేవదానవులిద్దరూ కలిసి సాగరమథనం చేసినప్పుడు అమృతం పుడుతుంది. ఆ అమృత కలశాన్ని దేవతల పథకం మేరకు ఇంద్రపుత్రుడు ఆకాశమార్గాన తీసుకుపోతుండగా దానికోసం దానవులు దేవతలతో తలపడి 12 రోజులపాటు భయంకర యుద్ధం చేశారట. ఈ యుద్ధకాలంలో కలశం(కుంభం) నుంచి కొన్ని అమృత బిందువులు భూమిమీద పడ్డాయట. అవి హరిద్వార్‌, ప్రయాగ, ఉజ్జయిని, త్రయంబకేశ్వర్‌ క్షేత్రాల్లో పడ్డ కారణంగా సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి ఆ అమృత బిందువుల్ని రక్షించారట. అందువల్ల సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి విభిన్న రాశుల్లో ప్రవేశించినప్పుడు ఈ కుంభమేళా జరుగుతుందట. ఆ 12 రోజుల యుద్ధం మానవజాతికి 12 సంవత్సరాలతో సమానం. దీని ఆధారంగా ప్రతి మూడేళ్లకీ ఓ ప్రదేశం చొప్పున ఆ నాలుగుచోట్లా కుంభమేళాలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే సింహరాశిలో గురుడు, సూర్యుడు వచ్చినప్పుడు గోదావరి పుట్టినచోట త్రయంబకేశ్వరంలోనూ, మేషరాశిలో సూర్యుడు, కుంభరాశిలో గురుడు వచ్చినప్పుడు హరిద్వార్‌లోనూ, వృషభరాశిలో బృహస్పతి, మకరరాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ప్రయాగలోనూ, సింహరాశిలో బృహస్పతి, వృషభరాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఉజ్జయినీలోనూ ఈ కుంభమేళాలు జరుగుతాయి.

ముఖ్యంగా సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు 33 కోట్ల దేవతలు, 999 నదీనదాలు, 68 మహాతీర్థాలతోపాటు 12 జ్యోతిర్లింగాల్లోని శక్తులన్నీ కలిసి త్రయంబకేశ్వరంలో కొలువవుతాయని శివమహాపురాణం పేర్కొంటోంది. కార్తీకమాసంలో వెయ్యిసార్లూ, మాఘమాసంలో వందసార్లూ వైశాఖంలో కోటిసార్లూ గంగాస్నానం చేస్తే ఎంత పుణ్యఫలం సిద్ధిస్తుందో అదే ఫలం సింహస్థకుంభమేళాలో కుశావర్తంలో ఒక్కసారి చేస్తే లభిస్తుందట. ఆ మహిమను పదేపదే తలచుకుంటూ రాబోయే కుంభమేళాలో మరోసారి రావాలనుకుంటూ తిరుగుప్రయాణమయ్యాం.

courtesy with Eenadu newpaper ... july 5 , 2015

  • *=================================* 

 Visit my website : Dr.Seshagirirao.com _ 

Sunday, June 7, 2015

నరసింహుడు తాతయ్యాడు,Narasimhaswami temple Singarayakonda









మీన కూర్మ వరాహావతారాల తరువాత తనేసర్వం అని ప్రార్థించిన భక్తుని కోసం మహా విష్ణువు నరమృగ అవతారాన్ని ఎత్తాడు. ఆయన్నే నారసింహుడనీ పిలుస్తాం. అయితే ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మాత్రం ఆయనకు తాతయ్య అన్న బిరుదు కూడా ఉంది. అదెలా వచ్చిందో... మనమూ తెలుసుకుందాం!
ఒకవైపు మహోగ్ర రూపం.. మరోవైపు ప్రసన్న వదనం... ఓ పక్క లక్ష్మీ నారసింహుడు, మరో పక్క యోగ నారసింహుడు... ఇలా ఒకే క్షేత్రంలో రెండు గర్భగుడుల్లో స్వామి భక్తులకు కొంగు బంగారంగా అలరారుతున్న దివ్యక్షేత్రం ప్రకాశంజిల్లాలోని సింగరాయకొండ. ద్వాదశ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఇది ప్రసిద్ధి పొందింది. సింగరాయకొండ పట్టణంలోని ఓ కొండమీద వెలసిన ఈ క్షేత్రపు ప్రధాన ప్రాంగణంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన వరాహ లక్ష్మీనరసింహస్వామి రాజ్యలక్ష్మి, గోదాదేవి సమేతంగా కొలువై ఉంటాడు. అదే దేవాలయపు తూర్పుభాగంలో తాతగుడిలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి వెలసి ఉంటాడు. పర్ణశాలలో దేవరుషి నారద మహాముని తపమాచరించి నృసింహ స్వామిని ప్రసన్నం చేసుకోగా- ఆయన కోరిక మేరకే యోగానంద నరసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడని ప్రతీతి. యోగ ముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు.
తాతగుడిగా...
కారడవిలో వెలసిన నరసింహస్వామికి గతంలో రెండు కిలోమీటర్ల దూరంలోని సోమరాజుపల్లి నుంచి అర్చకుడు వెళ్లి నిత్యం నైవేద్యం సమర్పించి వచ్చేవాడు. ఒకనాడు ఆయన అర్చన నిమిత్తం వెళుతూ తన ఆరేళ్ల పిల్లాడిని కూడా గుడికి తీసుకువెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటుండగా- నైవేద్యం పెట్టిన అర్చకుడు బిడ్డను మరచి ఆలయ తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. తరువాత గుర్తుకు వచ్చినా ఆ కారడవి ప్రాంతానికి రాత్రి పూట వెళ్లలేక పొద్దున్నే వెళ్లాడు. బిడ్డను ఏ క్రూరమృగాలో తినేసి ఉంటాయని అనుకుంటూ గుడి తలుపులు తీసిన అర్చకుడికి బిడ్డ ఆడుకుంటూ కనిపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అర్చకుడు బిడ్డను అక్కున చేర్చుకుని ఆరా తీయగా- గుడిలోని తాత అన్నం పెడితే తిని ఆడుకుంటున్నానని చెప్పాడు. అలా నాటి నుంచీ యోగ నరసింహస్వామిని తాత నారసింహస్వామిగా పిలుస్తున్నారు.
స్వామి వెలసిన ప్రాంతం ఒకప్పుడు కారడవి. ఇక్కడ కరాటి రాజ్యం ఖరదూషణాదుల పాలనలో సాగేది. ఖరాసురుడు నరసింహస్వామి భక్తుడు. అహోబిలం నుంచి వచ్చి స్వామిని దర్శించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్రమంలోనే ఖరాసురుడు స్వామిని వరం కోరగా.. శ్రీరామచంద్రుని రూపంలో కటాక్షిస్తానని అభయమిచ్చాడు. దానికి మనస్తాపం చెందిన ఖరాసురుడు యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగించడం మొదలు పెట్టాడు. తర్వాత వనవాస కాలంలో రుషి ఆశ్రమాల రక్షణ నిమిత్తం రామచంద్రుడు కరాటి రాజ్యం చేరాడు. ఖరుడు నరసింహ భక్తుడు కావడంతో శ్రీరామచంద్రుడు యోగనిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్ఠించి, అనంతరం ఖరదూషణాదులను వధించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
స్వామికి జ్యేష్ఠమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

- కోనేటి సురేష్‌బాబు, ఈనాడు, ఒంగోలు--ఫొటోలు: నూకసాని శ్రీనివాసులు

  • *=================================* 

* Visit my website : Dr.Seshagirirao.com _ 

Saturday, June 6, 2015

Janardhana swamy temple Dhavaleswaram,జనార్దనస్వామి ఆలయం ధవళేశ్వరం

  •  

  • Janardhana swamy temple Dhavaleswaram,జనార్దనస్వామి ఆలయం ధవళేశ్వరం

రాజమండ్రికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న జనార్దనస్వామి ఆలయానికి సంబంధించి ఎన్నో ఐతిహ్యాలూ పురాణగాథలూ! స్వామిని సాక్షాత్తూ నారద మహర్షే కొలిచాడంటారు. నదీమతల్లి గోదావరి జనార్దనుని సేవకే అవతరించిందంటారు.

భూమ్మీద వెలసిన తొలి వైష్ణవాలయం ధవళేశ్వరంలోని జనార్దనస్వామి దేవాలయమేనంటాయి పురాణాలు. నారదమహర్షి స్వహస్తాలతో జనార్దనుడికి పూజలు నిర్వహించాడని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు ఇక్కడికొచ్చి బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందాడని కూడా పురాణగాథ. ఒకానొక సందర్భంలో నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుడిని 'పితృదేవా! భక్తితో కొలిచిన వెంటనే, కోర్కెలు తీర్చే క్షేత్రం ఏది?' అని అడిగాడట. అందుకు బ్రహ్మదేవుడు 'గౌతమీనదికి ఉత్తరదిశలో ఆప్రాంతం ఉంది. అది జనార్దన క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. ఆదిలో నా నాలుగు ముఖాల నుంచీ నాలుగు వేదాలూ కోటిసూర్య ప్రచండ కాంతులతో బయటకు వచ్చాయి. మహర్షులూ దేవతలూ ఆ వేద కాంతినీ, కాంతి కారణంగా ఉద్భవించిన వేడినీ తట్టుకోలేక శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారు. అప్పుడే, దేవదేవుడైన నారాయణుడు వేయిబాహువులతో వేదాల్ని ఒడిసి పట్టుకుని, భూమిపై ఒక పర్వతంగా నిలిపాడు. ఆ వేదరాశియే జనార్దన పర్వతంగా ఏర్పడింది' అని చెప్పాడు.

 స్థల పురాణం.-వేదాలు వెలసిన కొండ...
పురాణ గాథల ప్రకారం...వ్యాస మహర్షి వేదాల అంతరార్థం తెలుపమంటూ ఘోరతపస్సు చేశాడు. జనార్దనుడు ప్రత్యక్షమై ఈ పర్వతం నుంచి నాలుగు పిడికిళ్ల మట్టిని తీసి వ్యాసుడికి అందించాడు. అతను వాటిని చతుర్వేదాలుగా విభజించాడు. అవే రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంగా వెలుగులోకి వచ్చాయి. కృతయుగంలో ఏర్పడిన ఈకొండ మీద తూర్పుచాళుక్యుల కాలంలో పూర్తి స్థాయిలో జనార్దనుడి ఆలయాన్ని నిర్మించారు.


భూదేవీ శ్రీదేవీ సమేతంగా...
గోదావరి సమీపంలో ఎత్త్తెన కొండ మీద నిర్మించిన ఆలయం... ఆధ్యాత్మిక తేజస్సుతో విరాజిల్లుతోంది. జనార్దనుడు ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమిస్తాడు. భువి మీదున్న 108 వైష్ణవాలయాలలో ఇదే ప్రథమమని బ్రహ్మదేవుడే చెప్పాడంటాయి పురాణాలు. ఈకొండ మీదే, ఓ గుహలో సంతాన గోపాలస్వామి వెలిశాడు. సంతానంలేని దంపతులు స్వామిని కొలిస్తే... పండంటి పిల్లలు పుడతారని ఓ నమ్మకం. త్రేతాయుగంలో శ్రీరాముడు జనార్దనస్వామిని దర్శించుకున్నాడట. రావణుడిని చంపాక... బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోడానికి ఈ క్షేత్రానికి వచ్చాడని ఐతిహ్యం. తన వెంట వచ్చిన ఆంజనేయుడిని ఈ ప్రాంతానికి రక్షకుడిగా ఉండమని ఆదేశించాడట శ్రీరాముడు. కాబట్టే, క్షేత్రపాలకునిగా మారుతి పూజలందుకుంటున్నాడు. 'నిన్ను వదలి ఉండలేను స్వామీ!' అని వేడుకున్న హనుమ కోసం తన పాదముద్రల్ని వదిలి వెళ్లాడు సీతారాముడు. శ్రీరాముని పాదాలు తాకిన ప్రదేశం కావటంతో రామపాదక్షేత్రంగానూ పిలుస్తారు.

గోదావరి జన్మస్థలి...
జనార్దన స్వామి అభిషేకం కోసమే గోదావరి పుట్టిందని పురాణ కథ. కృతయుగంలో నారదమహర్షి...సొరంగ మార్గం ద్వారా కాశీ వెళ్లి గంగాజలాన్ని తెచ్చి జనార్దనుడికి అభిషేకించేవాడట. 'నేనైతే మంత్రశక్తితో అంతదూరం వెళ్లి గంగాజలం తెస్తున్నా. కలియుగంలో పరిస్థితి ఏమిటి? స్వామివారి అభిషేకం ఎలా జరుగుతుంది?' అని ఆలోచించాడు. ఆ కార్యాన్ని గౌతముడి ద్వారా పూర్తిచేయాలని సంకల్పించాడు. ఆ సమయానికి గౌతముడు కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద తపస్సు చేసుకుంటున్నాడు. ఆరోజుల్లో పంటలు సరిగా పండక ప్రజలు దుర్భర దారిద్య్రాన్ని అనుభవించేవారు. గౌతముడు తన తపశ్శక్తితో ధాన్యాన్ని పండించి, ప్రజలకు నిత్యం అన్నదానం చేసేవాడట. నారదుడు తన చాతుర్యంతో, ఒకరోజు ఆయన సృష్టించిన పంటను గోవు తినేలా చేశాడు. అన్నదానానికి ఉపయోగించే ధాన్యాన్ని గోవు తినేసిందనే బాధతో, గౌతమ మహర్షి దర్భతో గోవును అదిలించాడు. ఆమాత్రానికే ఆ గోమాత చనిపోవటంతో గోహత్యా పాతక నివృత్తి కోసం గౌతముడు ఘోరతపస్సు ఆచరించి భువిపైకి గంగను రప్పించాడు. గోవు నడిచిన ప్రదేశంలో గంగ పుట్టటంతో ఆప్రాంతానికి గోదావరిగా నామకరణం చేశాడు. ఆ గోదావరి జలంతోనే జనార్దనుడికి నిత్యం అభిషేకాలు నిర్వహిస్తారు.


ఘనంగా రథోత్సవం
భీష్మ ఏకాదశి రోజున జనార్దన క్షేత్రంలో భవంగా రథోత్సవం జరుగుతుంది. కార్తీక, ధనుర్మాసాల్లో ప్రత్యేక పూజలూ వ్రతాలూ నిర్వహిస్తారు. మిగతా రోజుల్లోనూ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఉదయాస్తమాన పూజలు నిర్వహిస్తారు. కొండపైకి వెళ్లేదారంతా శ్రీమహావిష్ణు స్వరూపంగా కొలుస్తారు భక్తాదులు. రాజమండ్రి నుంచి బస్సులూ ఆటోలూ పుష్కలంగా ఉంటాయి.

- సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమండ్రి

  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _

Wednesday, June 3, 2015

Fifty four temples at one place,54 ఆలయాలు ఒకేచోట..గాదరాడ గ్రామం

  •  



    దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలూ శైవ ఆలయాలూ శక్తి పీఠాల నమూనాలూ అక్కడ కొలువయ్యాయి. మూలవిరాట్టుల పూజలూ నైవేద్యాలూ నిజ క్షేత్రాల్ని తలపించేలా ఉంటాయి. రాజమండ్రికి దగ్గర్లోని గాదరాడ గ్రామాన్ని సందర్శిస్తే సంపూర్ణ తీర్థయాత్రలు చేసొచ్చినంత సంతృప్తి.

ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిదీయతే - అంటుంది భగవద్గీత. ఈ శరీరమే ఓ క్షేత్రమని గీతావాక్కు. క్షేత్రం అంటే దేవాలయమన్న అర్థమూ ఉంది. దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః - అన్న ఆగమవాక్యం కూడా ఆ విషయాన్నే చాటుతోంది. భారతదేశంలో యాభై లక్షలకుపైగా ఆలయాలున్నాయని అంచనా. స్వయంభూ ఆలయాలూ, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలూ, శంకరభగవత్పాదులు-రామానుజులు- మధ్వాచార్యులూ తదితర దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులూ, చోళులు-పల్లవులు- కాకతీయులు-విజయనగర ప్రభువులూ...పాలకులు ప్రాణంపోసిన క్షేత్రాలూ - ఒకటారెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు. అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే...నమూనాలేమిటి, అక్కడ జరిగే పూజాదికాలన్నీ ఇక్కడా జరిగితే... నైవేద్యాలూ అచ్చంగా అలానే ఉంటే...ఇంకేముంది, సంపూర్ణ యాత్రా ఫలమే, సర్వదేవతా కటాక్షమే!

రాజమండ్రి సమీపంలోని గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో... 'ఓం శివశక్తి పీఠం' పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు. బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలాకాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయినా, మూలాల్ని మరచిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వూళ్లో చిన్నచిన్న గుళ్లూ గోపురాలూ చాలానే ఉన్నా, చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటీ లేకపోవడం లోటుగా అనిపించేది. దీంతో, వూరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవెల నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు. 'ఏ ఆలయాన్ని నిర్మించాలి?' అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతోమంది మఠాధిపతుల్నీ గురువుల్నీ కలిశారు. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమన్నారు, మరొకరు శివ లింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు. అన్నీ ఉత్తమంగానే అనిపించాయి. సర్వదేవతల ఆలయాల్నీ నిర్మించాలన్న ఆలోచన అప్పుడు కలిగిందే. జీవితభాగస్వామి వెంకటలక్ష్మి భర్త సంకల్పానికి మద్దతు ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులూ మేమున్నామని ముందుకొచ్చారు. విరాళాల కోసమో సాయం కోసమో ఎవర్నీ ఆశ్రయించకూడదనే నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి శిల్పుల్నో పిలిపించారు. ఇంజినీర్లతో మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమించినా, ఆలయ సముదాయానికి ఓ రూపం రావడానికి నాలుగేళ్లు పట్టింది.
ఎన్నో ఆలయాలు...
పీఠం ఆవరణలో మొత్తం యాభై నాలుగు దేవాలయాలున్నాయి. ఎనభై నాలుగు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు. కైలాస మహాక్షేత్రాలుగా (21), వైకుంఠ క్షేత్రాలుగా (15), శక్తిపీఠాలుగా (18) వాటిని విభజించారు. కైలాసక్షేత్రాల్లో...ద్వాదశ జ్యోతిర్లింగాలైన సౌరాష్ట్రలోని సోమనాథ లింగం, శ్రీశైలంలోని మల్లికార్జున లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరలింగం...ఇలా పన్నెండు లింగాలూ కొలువయ్యాయి. ఇక్కడే ఆనందనిలయ వాసుడిని అర్చించుకోవచ్చు - భూదేవి, శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడే షిర్డీనాథుడిని ప్రార్థించుకోవచ్చు - సద్గురు సాయిబాబా మందిరం ఉంది. ఇదే భద్రాది, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవల్లి...కోదండ రామస్వామి, రమాసత్యనారాయణ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఇక్కడున్నాయి.

పూజాదికాలు ఇలా...
శివుడి పరివార దేవతలకు శైవాగమం ప్రకారమూ వైష్ణవాలయాల్లో వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారమూ పూజలు నిర్వహిస్తారు. మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేదపండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో ఓ గోశాల ఉంది. వేదపాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయంలోకి వెళ్లగానే, 32 అడుగుల ఎత్తుతో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతాడు. భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మవరపు వెంకటనారాయణశర్మ. రాజమండ్రి నుంచి కోరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గాదరాడకు ఆటోలు ఉంటాయి. తిరుగు ప్రయాణంలో కోరుకొండలోని లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు. గుట్టమీదున్న ఆలయం త్రేతాయుగం నాటిదని అంటారు.

- సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమండ్రి సాంస్కృతికం
  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _

Sunday, May 24, 2015

Salvation giving seven holyplaces,ముక్తి నొసగే సప్త క్షేత్రాలు








  • Salvation giving seven holyplaces,ముక్తి నొసగే సప్త క్షేత్రాలు
భారత పురాణాలు మనకు ఏడు ముక్తిని ప్రసాదించే దివ్య క్షేత్రాల గురించి తెలియచేశాయి. దర్శన, స్మరణ,పఠన, శ్రవణ మాత్రాననే మానవుల సర్వ పాపాలు తొలగిపోయి వారిని భగవత్‌ సన్నిధిని చేర్చే అవి ...1.అయోధ్య, 2.మథుర, 3.మాయ ( హరిద్వార్‌), 4.కాశి, 5.కంచి, 6.అవంతిక ( ఉజ్జయిని), మరియు 7.పూరి. వాటితో సరిసమానమైన స్థలాలు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. అవి 1,ఉడిపి, 2.కుక్కే-సుబ్రహ్మణ్యం, 3.కుంబాసి, 4.కోటేశ్వర, 5.శంకర నారాయణ,6.కొల్లూర్‌ మరియు 7.గోకర్ణం.

స్కాందపురాణం లోని సహ్యాద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాలు ఉత్తర కర్నాటకలో పరశురాముడు సృష్టించిన నేటి కొంకణ భూభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ ఏడు క్షేత్రాలు కూడా ఎన్నో శతాబ్దాల చరిత్రకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయాలు.

ఉడిపి
శ్రీ కృష్ణ క్షేత్రాలలో పేరొందిన ఉడిపికి ఆ పేరు రావడానికి సంభందించి రెండు రకాల కధనాలు వ్యాప్తిలో ఉండటం విశేషం. ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్ధం. నక్షత్రాల దేవుడు వెన్నెల రేడు చంద్రుడు. దక్ష శాపం నుండి సదాశివుని కృప వలన విముక్తుడై, శాశ్వతంగా ఆయన శిరమందు నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన క్షేత్రం అయినందున ఈ పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతున్నది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు. రెండవ కధనం ప్రకారం ఉడిపి అన్న పదం ఒడిపు అన్న తుళు పదం నుండి వచ్చినది అని, దానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు. జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !
ఉడిపి దై్వత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలం.
పదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.

కుక్కే సుబ్రహ్మణ్యం దేవస్థానం
ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా (160 కి. మీ ) దక్షిణ కర్ణాటకలో ఉన్నది.
ఈ దివ్య క్షేత్ర పురాణ గాధ సత్య యుగం నాటిది.
లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనతో మార్గశిర సుద్ద షష్టి నాడు ఇక్కడే జరిగినది.
స్కన్దునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు.
ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార.కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ది.
దీనికి గల కారణం గురించిన గాధ ఇలా ఉన్నది.
గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. అందువలన ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది.

శంకర నారాయణ ఆలయం
కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో శంకరనారాయణలో ఉన్న శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. స్థానిక గాధ గురించిన విశేషాలు అందుబాటులో లేవు. కానీ ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా లభించిన ఆధారాల వలన తెలుస్తోంది.
సహ్యాద్రి పర్వతాలలో ఒకే పానువట్టం మీద హరిహరులిరువురూ లింగ రూపాలలో కొలువుతీరిన ఒకే ఒక్క క్షేత్రం ఇదేనేమో ! వ్యత్యాసము తెలియడానికి అన్నట్లు విష్ణు లింగ పై భాగాన కామ ధేనువు గిట్టల ముద్రలుంటాయి. మరో విశేషము ఏమిటంటే ఇక్కడ జయ విజయులు మరియు నంది ఉండటం. ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు.

కోటేశ్వర
ఉడిపికి సుమారు ముపై్ప కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైనందున కోటేశ్వర అన్న పేరొచ్చింది. గతంలో ఉన్న ఏడు ప్రాకారాలలో కొంత వరకు కనుమరుగయ్యాయి. ఆలయ వెలుపల ఉన్న పెద్ద గద్దెను నిర్మించిన విధానానికి దానిని ఎక్కితే లోపల గర్భాలయంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని నేరుగా కాంచవచ్చును.
ఈ ఆలయంలో అన్ని ప్రత్యేక రూపాలలో కనపడతాయి.
ఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, రెండో ప్రాకారంలో ఉన్న ఏనాటిదో తెలియని పెద్ద శిలా శాసనం ( ఇందులోని భాష గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటారు) ఇలా ప్రతివక్కటి విశేషమే !

అనెగుద్దె ( కుంభాషి )
సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది అనెగుద్దె లేక కుంభాషి. ఉడిపికి ముపై్ప కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువు తీరినది విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు.
గజముఖుదు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనే గుద్దే ( ఏనుగు తల). పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట.
తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి వారు ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచడానికి యాగం ఆరంభించారట.
దానిని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట.
కుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలవబడుతోంది.
యాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట.
యాగారంభములో పాండవులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి నేటికీ అందరి పూజలు అనుకొంటున్నారు. ఇక్కడ ఒక చిన్న బిలం నుండి ఊరే నీరు గంగ నది అంత ర్వాహినిగా ప్రవహించడం వలన వస్తోంది అంటారు. దగ్గరలో సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి ఉంటాయి. అలానే వారి ఆలయాలు కూడా ఉంటాయి. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో పెద్దశిరస్సు, చెవులతో, నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి దర్శనమిస్తారు.

కొల్లూర్‌ శ్రీ మూకాంబిక దేవి :
కోలా మహర్షి లోక కళ్యాణార్ధం చేసిన తపస్సుకు సంతసించిన సదా శివుడు ప్రత్యక్షం కాగ మహర్షి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యాన్ని కోరుకోన్నారట.
అందుకే లింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది.
తదనంతర కాలంలో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఇక్కడ శ్రీ చక్ర సహిత దేవి యొక్క పంచలోహ విగ్రహాన్ని, శ్రీ చంద్రమౌలీశ్వర లింగాన్ని ప్రతిష్టించారట.
దేవి నవరాత్రులు, శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు.

శ్రీ మహాబలేశ్వర స్వామి కొలువుతీరిన గోకర్ణం :
ఉత్తర కర్ణాటకలో ఉన్న సప్త ముక్తి క్షేత్రాలలో ఆఖరిది గోకర్ణం.
రామాయణ కాలం నాటి ఈ క్షేత్ర గాధ అందరికి తెలిసినదే !
పరమ శివుని మెప్పించి ఆత్మ లింగాన్ని తీసుకొని లంకానగారానికి వెళుతున్న రావణాసురుని నుండి ఉపాయంతో గణపతి ఇక్కడ ఉంచాడు అన్నదే ఆ గాధ !
శ్రీ మహా బలేశ్వర స్వామి కొలువు తీరిన గోకర్ణం ఒక ఆద్యాత్మిక పర్యాటక కేంద్రం.
గోకర్ణం ఉడిపికి నూట డెభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ ఏడు స్థలాలను ఈ క్రింది మార్గంలో సందర్శించవచ్చును. తొలుత నేరుగా గోకర్ణం. తరువాత ఉడిపి తరువాత కుక్కే సుబ్రహ్మణ్యం. ఉడిపి నుండి బయలుదేరి కుందుపర వెళ్ళే దారిలో కుంబాషి, కోటేశ్వర సందర్శించుకొని కుందుపర, కొల్లూరు మీదగా శంకరనారాయణను చేరుకొని నాలుగు రోజులలో ప్రశాంతంగా యాత్ర పూర్తి చేసుకోవచ్చును.

courtesy with Surya telugu newspaper--23 April 2015.

  • *=================================* 
* Visit my website : Dr.Seshagirirao.com _

Friday, December 19, 2014

Mettu Ramlingeswara temple, మెట్టు రామలింగేశ్వరాలయం-మెట్టుగుట్ట-వరంగల్‌ జిల్లా

  •  
  •  
    Mettu Ramlingeswara temple, మెట్టు రామలింగేశ్వరాలయం-మెట్టుగుట్ట-వరంగల్‌ జిల్లా


త్రేతాయుగంలో సీతారాములు ఇక్కడి శివలింగాన్ని పూజించారంటారు. ద్వాపరయుగంలో భీమసేనుడు ఈ కొండను దర్శించాడంటారు. కలియుగంలో ఓ కవి ఇక్కడే సరస్వతీమాత సాక్షాత్కారం పొందాడంటారు. ఆ క్షేత్రమే వరంగల్‌జిల్లా మడికొండ గ్రామంలోని మెట్టుగుట్ట!

శివకేశవుల మధ్య అభేద్యాన్ని చాటిచెప్పిన పుణ్యక్షేత్రం మెట్టుగుట్ట. ఇక్కడ శివాలయం, రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. మహాలింగం కాశీలోని విశ్వేశ్వరుడిని పోలి ఉంటుంది. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలోని నీళ్లు సాక్షాత్తూ కాశీ గంగాజలమేనని భక్తుల నమ్మకం. కాబట్టే ఈ క్షేత్రానికి 'దక్షిణ కాశీ'గా పేరొచ్చింది. వరంగల్‌ జిల్లా, హన్మకొండ మండలం, మడికొండ గ్రామంలో...హైదరాబాద్‌-హన్మకొండ జాతీయ రహదారి మీద కాజీపేట రైల్వే జంక్షనుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. సీతారామచంద్రులు భద్రాచల ప్రాంతంలో సంచరించిన సమయంలో...మెట్టుగుట్ట క్షేత్రానికి వచ్చి శివుడిని అర్చించినట్టు స్థానిక ఐతిహ్యం. అందుకే మెట్టు రామలింగేశ్వరాలయమన్న పేరు వచ్చింది. ఇక్కడున్న రామాలయమూ అంతే ప్రాచీనమైంది.

కాకతీయుల కాలంలో...
వేంగి చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందిందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. శిల్పరీతిని బట్టి చూస్తే వీరభద్రాలయాన్ని చాళుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చు. దేవగిరి యాదవరాజుల దండయాత్రలను అరికట్టడానికి మడికొండ మెట్టుగుట్ట ప్రాంతం అనువైందని కాకతీయులు గుర్తించారు. అక్కడో కోట కూడా కట్టారు. క్రీ.శ. 1198-1261 మధ్యకాలంలో కాకతీయ రాజులు మెట్టుగుట్ట మీద ఆలయాలు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.

సిద్ధుల తపస్సుతో...
కరవుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజల కోసం మాండవ్య, మరీచి, శాండిల్యాది నవసిద్ధులు తపస్సు చేయగా...పరమ శివుడు సిద్ధేశ్వరమూర్తిగా మెట్టుగుట్ట క్షేత్రంపై అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. కొండమీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి పూజలందుకుంటున్నారు. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రంలో ధూపదీప నైవేద్యాల కోసం 450 ఎకరాల మాన్యాన్ని కానుకగా ఇచ్చారు. సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు మండలం రోజులు గుట్టపై వాగీశ్వరీ ఉపాసన చేసినట్టు చెబుతారు. సరస్వతీదేవి ప్రత్యక్షమై భాగవతాన్ని తెలుగులో రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందమని ఆశీర్వదించిందని ఓ కథనం. నవసిద్ధులు తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నవ గుండాలూ ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపవినాశనిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవే. జీడి గుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందంటారు. కన్ను గుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మిక. అందులో నాణెం వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు సమర్పించుకుంటారు భక్తులు.
మెట్టుగుట్ట మీద 165 అడుగుల ఎత్తులో రెండు చూడముచ్చటైన శిఖరాల జంట ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపైన ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. భీముని భార్య హిడింబి గచ్చకాయలు ఆడుకుని, వాటిని ఒకదానిపై ఒకటి పేర్చిందనీ...ఆవే ఈ శిలలనీ ఓ కథ ప్రచారంలో ఉంది. వీటినే దొంతలమ్మ గుండ్లని వ్యవహరిస్తారు. గుట్టమీద ఓ జత పాదముద్రలున్నాయి. ఇవి, ద్వాపరయుగంలో ఇక్కడికొచ్చిన భీమసేనుడివేనంటారు. అలా, ముచ్చటగా మూడు యుగాల్లోనూ మెట్టుగుట్ట ప్రశస్తిని పొందింది.

ఘనంగా బ్రహ్మోత్సవాలు
ఏటా మెట్టుగుట్టపై మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి జాగరణ, శివపార్వతుల కల్యాణం నేత్రపర్వంగా సాగుతాయి. శ్రీరామనవమి వేడుకలు, కార్తీక దీపోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంగా మెట్టుగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణోత్సవం అనంతరం నిర్వహించే రథోత్సవంలో...తేరును లాగితే అవివాహితులకు కల్యాణయోగం ప్రాప్తిస్తుందంటారు.

ఇలా వెళ్లాలి...
నిత్యం హైదరాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాలనుంచి వందలాది బస్సులు మడికొండ హైవే మీదుగా హన్మకొండ, వరంగల్‌ వైపు వెళ్తుంటాయి. భక్తులు మడికొండ వద్ద బస్సుదిగి మెట్టుగుట్ట ఆలయానికి నడిచివెళ్లవచ్చు. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో వచ్చే భక్తులకు కాజీపేట జంక్షన్‌ స్వాగతం పలుకుతుంది. ఇక్కడ బస్సుదిగితే స్టేషన్‌ పక్కనే స్థానిక బస్టాండు ఉంటుంది. అక్కడ మడికొండ, ధర్మసాగర్‌, రాంపూర్‌, నారాయణగిరి, వేలేరు, పీసర రూటులో వెళ్లే ఏ బస్సు ఎక్కినా మడికొండ దగ్గర దిగి, మెట్టుగుట్ట క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు. భక్తుల సౌకర్యం కోసం నాలుగు సత్రాలున్నాయి.
- డి.రవీందర్‌యాదవ్‌, న్యూస్‌టుడే, మడికొండ


*=================================*
* Visit my website : Dr.Seshagirirao.com _

Monday, July 28, 2014

Mannarshala Nagaraj Temple(kerala),మన్నార్‌శాల నాగరాజ ఆలయం-అళప్పుజ(కేరళ)






    నాగరాజు, నాగదేవత, నాగన్న... ఇలా రకరకాలుగా పిలుచుకుంటూ భక్తిభావంతో నాగులను పూజించే సంప్రదాయం పురాణకాలం నుంచీ ఉంది. దక్షిణభారతంలో ఎక్కువగా శివార్చనలో భాగంగానో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రూపంలోనో లేదా ఏ చెట్టు కిందో పుట్ట చెంతో నాగదేవతను అర్చిస్తుంటారు. కానీ నాగారాధనకోసం పామురూపంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందుకోసం ప్రత్యేకంగా గుడులూ గోపురాలూ నిర్మించడం మాత్రం అరుదే. అలాంటివాటిల్లో ఒకటి కేరళలోని మన్నార్‌శాల నాగరాజ ఆలయం. (ఆగస్టు 1న నాగపంచమి)

అళప్పుజకి సమీపంలోని మన్నార్‌శాల నాగరాజ ఆలయంలో పౌరోహిత్యం చేసేవాళ్లంతా స్త్రీలే కావడం విశేషం. ప్రధాన గుడిలో నాగరాజ విగ్రహం కొలువుదీరుతుంది. ఇందులోనే భార్యలైన సర్పయక్షిణి, నాగయక్షిణిలతోపాటు సోదరి నాగచాముండికీ ఆలయాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోనూ అక్కడ ఉన్న చెట్ల చుట్టూ ఉన్న గట్లుమీదా... సుమారు 30 వేల నాగదేవత శిలావిగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. పిల్లలు పుట్టాక ఆ పిల్లలతోసహా వచ్చి స్వామికి సర్పరూపంలోని విగ్రహాన్ని కానుకగా ఇస్తారు.

ఆలయ ప్రాశస్త్యం
ఈ నాగరాజ ఆలయంలోని ప్రధాన దేవతను పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చెబుతారు. క్షత్రియుల్ని వధించిన పరశురాముడు, పాపవిముక్తి కోసం రుషులను ఆశ్రయించగా బ్రాహ్మణులకు భూమిని దానం చేయమంటారు. అప్పుడాయన శివుణ్ణి తలచుకుని, ఆయనిచ్చిన గొడ్డలిని సముద్రంలోకి విసరగా ఏర్పడిన భూభాగమే కేరళ. దాన్నే పరశురాముడు బ్రాహ్మణులకు దానం చేయగా, ఆ నేలంతా ఉప్పుమయం కావడంతో అక్కడెవరూ ఉండలేక వెళ్లిపోతుంటారు. అది చూసిన భార్గవరాముడు శివుణ్ని ప్రార్థించగా- విషజ్వాలలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తే ఉప్పు ప్రభావం పోతుందనీ, అందుకోసం నాగదేవతను అర్చించాలని చెబుతాడు. దాంతో పరశురాముడు సముద్రం ఒడ్డునే ఉన్న ఓ ప్రాంతాన్ని గుర్తించి, దానికి 'తీర్థశాల' అని పేరు పెట్టి, అక్కడ నాగదేవతను అర్చిస్తాడు. భార్గవరాముడి పూజలకు నాగరాజు దివ్యమణులతో వెలిగిపోతూ ప్రత్యక్షమై, భయంకరమైన విషసర్పాలను వదలగా, అవన్నీ విషజ్వాలలతో నేలలోని ఉప్పుని పీల్చేస్తాయి. ఆపై పరశురాముడు వేదమంత్రాలతో తీర్థశాలలోని మందార(అగ్నిపూలు)వృక్షాల మధ్యలో నాగరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడన్నది పురాణ కథనం. అదే మందారశాలగా మన్నార్‌శాలగానూ మారింది.
  • ఐదు తలల నాగరాజు!
                               

  •  
చాలాకాలం తరవాత... ఇక్కడి ఆలయంలో వాసుదేవ, శ్రీదేవి దంపతులు సంతానరాహిత్యంతో బాధపడుతూ నాగరాజుని పూజిస్తుండగా, అడవికి నిప్పు అంటుకుంటుంది. ఆ జ్వాలల తాపానికి తట్టుకోలేక విలవిల్లాడిపోతున్న సర్పాలను కాపాడతారా దంపతులు. పంచగవ్యం రాసి, చందనం పూసి, దేవదారు చెట్లకింద విశ్రమింపజేసి, పంచామృతాన్నీ అప్పాలనీ అటుకుల పాయసాన్నీ ప్రసాదంగా పెడతారు. ఆ సేవలకు మెచ్చిన నాగరాజు ప్రత్యక్షమై, 'వారికి కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటాననీ, మన్నార్‌శాలలో విగ్రహం రూపంలో భక్తులకు ఎప్పటికీ తన ఆశీర్వాదం ఉంటుంద'నీ చెప్పి అదృశ్యమవుతాడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణ స్త్రీ, ఐదుతలలు ఉన్న బిడ్డతోపాటు సాధారణ రూపంలోని మరో బిడ్డకీ జన్మనిస్తుంది. కొంతకాలానికి ఐదుతలల బాలుడు తన జన్మరహస్యాన్ని గ్రహించి, తమ్ముడికి కుటుంబ బాధ్యతలు అప్పగించి, గుడి ఆవరణలోనే తాను సమాధిలోకి వెళ్లిపోతాననీ, ఆ రోజున ప్రత్యేక పూజలతో అర్చించమనీ చెబుతాడు. అందుకే ఇప్పటికీ నాగరాజు సమాధిలో తపస్సు చేస్తూ భక్తులను కరుణిస్తున్నాడని విశ్వాసం. ఆ కుటుంబీకులు ముతాసన్‌ అనీ, అపూపన్‌(తాత)అనీ ఆయన్ని ఆప్యాయంగా పిలుస్తుంటారు. అందుకే నాగపంచమితోపాటు ఆయన సమాధిలోకి వెళ్లిన రోజున ఐల్యం వేడుకనీ ఆయన చెప్పినట్లే ముగ్గురూపంలో నాగబంధనం వేసి, ఘనంగా జరుపుతారు. అప్పటినుంచీ ఆ కుటుంబానికి చెందిన వృద్ధమహిళే నాగరాజుకి పూజాపునస్కారాలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది.
ఆలయంలో భక్తులు సంపదకోసం బంగారాన్ని నింపిన కుండనీ, విద్యకోసం దేవుడి బొమ్మలతో కూడిన ఆభరణాలనీ; ఆరోగ్యం కోసం ఉప్పునీ; విషప్రభావం నుంచి కాపాడుకునేందుకు పసుపునీ వ్యాధుల నివారణకోసం మిరియాలు, ఆవాలు, పచ్చిబఠాణీలనీ; నష్టనివారణకోసం బంగారంతో చేసిన పాముపుట్టనీ లేదా పాముగుడ్లనీ లేదా చెట్టునీ; దీర్ఘాయుష్షుకోసం నెయ్యినీ సమర్పించుకుంటారు. ప్రత్యేకంగా సంతానానుగ్రహం కోసం అయితే రాగి, ఇత్తడితో చేసిన చిన్నపాత్రను కానుకగా సమర్పించి పూజిస్తారు. నురుంపాలం, కురుతి అనే నైవేద్యాలతో నాగన్నని అర్చించడమే ఈ ఆలయం ప్రత్యేకత.

*=================================*

* Visit my website : Dr.Seshagirirao.com _